మొబైల్‌ మన పిల్లల్ని ముంచేస్తుంది!

social-media-e1770729643820.jpg

జంక్‌ఫుడ్‌పైనే కాదు, సోషల్ మీడియాపైనా ఎకనమిక్ సర్వే రెడ్‌ సైరన్ మోగించింది. మొబైల్ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోందని హెచ్చరిస్తోంది. భారత్‌లో వేగంగా పెరుగుతున్న డిజిటల్ అడిక్షన్‌పై ఎకనామిక్ సర్వే-2026 ఆందోళన వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా పిల్లలు, యువతలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, గేమింగ్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల వాడకంలో హద్దులు దాటడం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించింది.

పిల్లలు ఎక్కువ టైమ్‌ను సోషల్ మీడియాకు కేటాయిస్తున్నారు. దీంతో మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయి. చదువుపై ఏకాగ్రత తగ్గిపోతోంది. దీని ప్రభావం వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు… దేశ ఆర్థిక ఉత్పాదకతపై కూడా పడుతోందని ఎకనమిక్‌ సర్వేలో తేలింది. చిన్న వయసులోనే డిజిటల్ వ్యసనం పెరగడం వల్ల హానికర కంటెంట్‌కు బలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది.

డిజిటల్ అడిక్షన్ అంటే కేవలం ఫోన్ వాడకం మాత్రమే కాదు. మానసిక క్షోభ, సామాజిక దూరం, పని సామర్ధ్యం తగ్గించే ప్రమాదకర అలవాటని ఈ సర్వే తేల్చింది. పిల్లలు చదువుల్లో వెనకబడటం, ఉద్యోగులు విధుల్లో సామర్ధ్యం మేరకు పనిచేయకపోవడం లాంటి దీర్ఘకాల ప్రభావాలను కలిగిస్తోందని హెచ్చరించింది. ఆర్థికంగా కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని సర్వే అంచనా వేసింది.

సోషల్ మీడియా వ్యసనంతో ఆందోళన, డిప్రెషన్, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, సైబర్ ఒత్తిళ్లు, ఇవన్నీ 15 నుంచి 24 ఏళ్ల యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపింది. యువత ఆత్మహత్యలు పెరిగిపోవడానికి కూడా కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో సుమారు 40 కోట్ల మంది ఓటిటి వీడియోలు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తుంటే, 35 కోట్లకు పైగా మంది సోషల్ మీడియాపై యాక్టివ్‌గా ఉన్నారని తేల్చింది.

ప్రత్యేకంగా 15 నుంచి 29 ఏళ్ల యువతలో మొబైల్, ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగిందని తెలిపింది. డిజిటల్ సమస్యను ఎదుర్కొనేందుకు సర్వే పలు పరిష్కారాలను సూచించింది. సైబర్ సేఫ్టీ ఎడ్యుకేషన్‌తో పాటు స్కూల్స్‌లో తప్పనిసరిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని పేర్కొంది. ఫ్యామిలీలు స్క్రీన్ టైమ్ పరిమితులు, డివైస్ ఫ్రీ అవర్స్, ఆఫ్‌లైన్ యాక్టివిటీస్‌ను అలవాటు చేసుకోవాలని సిఫారసు చేసింది.

ఆస్ట్రేలియా, చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఇప్పటికే కఠిన చర్యలు అమలులో ఉన్నాయి. భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఎకనమిక్‌ సర్వే సూచించింది. డిజిటల్ భవిష్యత్తు అవసరమే…కానీ అది యువత మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేయకూడదని ఎకనమిక్ సర్వే గట్టి హెచ్చరిక జారీ చేసింది.

Share this post

submit to reddit
scroll to top