lolita-express2-e1772024275527.png

కామాతురాణాం నభ‌యం నల‌జ్జ అన్న‌ట్లు సంప‌న్నుల విప‌రీత కోరిక‌ల‌కు దారులు చూపించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ప్ర‌తీ జ్ఞాప‌కం ఓ హార‌ర్ స్టోరీనే. జైలుగోడ‌ల మ‌ధ్య దిక్కులేని చావుచచ్చినా అత‌గాడి అకృత్యాల‌కు ఇప్ప‌టికీ ఎన్నో ఆధారాలు మిగిలే ఉన్నాయి.

ఎప్‌స్టీన్‌కి సొంత బోయింగ్-727 విమానం ఉండేది. దానికి మ‌రో పేరు కూడా ఉంది. లోలిటా ఎక్స్ ప్రెస్. లోలిటా అంటే మగాడి వాంఛ తీర్చే ప‌సిప్రాయ‌పు అమ్మాయ‌ని అర్ధం. దీన్నిబ‌ట్టే అర్ధ‌మైపోవ‌డం లేదూ ఎప్‌స్టీన్ ఎంత నీచుడో. వాడితో సాన్నిహిత్యానికి ఆరాట‌ప‌డ్డ ప్ర‌పంచ దేశాల పెద్ద‌లెంత వికృత‌మైన మ‌న‌స్కులో.

ప్రపంచం నలుమూలల నుంచి ముక్కుప‌చ్చ‌లార‌ని అంద‌మైన అమ్మాయిలను తన దీవికి రవాణా చేసేవాడు. వారిని నయానో భయానో ఒప్పించేవాడు. ప్ర‌లోభ‌పెట్టేవాడు. ఎప్‌స్టీన్ ట్రాప్ చేసే అమ్మాయిల్లో ఎక్కువమంది 14 నుంచి 15 ఏళ్ళలోపువారే. పేద‌రికాన్ని ఆస‌రా చేసుకుని కూడా పిల్ల‌ల ట్రాఫికింగ్‌కి తెగ‌బ‌డేవాడు ఆ క‌ర్కోట‌కుడు.

ప్రపంచ కుబేరులు ఆ లోలిటా ఎక్స్‌ప్రెస్‌లోనే త‌మ ప‌శువాంఛ‌లు తీర్చుకునేవారు. త‌మ ప్రైవ‌సీకోసం కోట్లు గుమ్మ‌రించేవారు. త‌మ అధికారాన్ని ఎప్‌స్టీన్ పాదాల ద‌గ్గ‌ర పెట్టేవారు. ఆ పాపాలకు సాక్ష్యంగా ఎప్‌స్టీన్‌ బోయింగ్ విమానం దుమ్ముకొట్టుకుపోయి ప‌డుంది. అకృత్యాల‌కు ఓ జ్ఞాప‌కంగా పార్కింగ్ స్థ‌లంలో నిలిపి ఉంది.

రిజిస్ట్రేషన్ గడువు 2019 నుంచి ముగియడంతో స్టాంబాగ్ ఏవియేషన్‌లో ఉన్న ఈ విమానం ఇక ఎగిరే అవ‌కాశ‌మే లేదు. ఎందుకంటే ఇంజిన్లు అమ్మేశారు. ఎండ‌కు ఎండుతూ వాన‌కూ త‌డుస్తూ ఎప్‌స్టీన్ పాపాల‌కు సాక్ష్యంగా ఇంకా మిగిలే ఉందా బోయింగ్ విమానం. ఈ విమానంలో బెడ్‌రూమ్, మూడు సిట్టింగ్ ప్రాంతాలు, రెండు బాత్‌రూమ్‌లు, కిచెన్ ఉన్నాయి. ఒక‌ప్పుడు విలాసాన్ని చాటిన‌ పాలిష్ కలప, రెడ్ వెల్వెట్ సోఫాలు, అద్దాల గోడల‌ను ఇప్పుడు పురుగులు, ఫంగస్ కప్పేశాయి.

అమ్మాయిల ర‌వాణాకు ఈ విమానాన్ని ఎప్‌స్టీన్ ఉప‌యోగించాడ‌ని ఫెడరల్ అధికారులు అభియోగాలు మోపారు. ఫ్లైట్ లాగ్స్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింట‌న్ నుంచి బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్య్రూ దాకా అనేక ప్రముఖుల పేర్లు నమోదయ్యాయి. దాదాపు 60 ఏళ్ల వయస్సున్న ఈ బోయింగ్ 727ను 2001 జనవరిలో ఎప్‌స్టీన్‌కి చెందిన డెలావేర్ సంస్థ కొనుగోలు చేసింది.

న్యూయార్క్, ఫ్లోరిడా, న్యూ మెక్సికో, యూఎస్ వ‌ర్జిన్ దీవుల్లోని ప్రైవేట్ ఐలాండ్‌ల మ‌ధ్య బాధిత బాలిక‌ల రవాణాకు ఎప్‌స్టీన్ ఈ విమానాన్ని ఉప‌యోగించిన‌ట్లు గుర్తించారు. ఈ జెట్ బ్రిట‌న్ విమానాశ్ర‌యాలు, ఎప్‌స్టీన్ స్థావ‌రాల మ‌ధ్య 90 సార్లు ప్రయాణించిందని డాక్యుమెంట్లు నిర్ధారిస్తున్నాయి. ఆకాశంలోకి ఎగిరాక ఆ విమానంలో అకృత్యాలు ఎవ‌రి కంటా ప‌డేవి కావు. బాధిత బాలిక‌ల ఆర్త‌నాదాలు ఎవ‌రికీ వినిపించేవి కావు. 20 ఏళ్ల‌పాటు ఈ విమానాన్ని ప్ర‌ముఖుల వినోద ప్ర‌పంచంగా వాడేసుకున్న ఎప్‌స్టీన్‌.. 2018 డిసెంబరులో తన అరెస్టుకు కొన్ని నెల‌ల‌ముందే చ‌డీచ‌ప్పుడు కాకుండా అమ్మేశాడు.

 

Share this post

submit to reddit
scroll to top