2 కోట్ల మంది జనాభా..
2,060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
ఇదీ గ్రేటర్ హైదరాబాద్ రేంజ్. దీనికి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) అనే మరో పేరు కూడా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి ప్రాంతాన్ని మిగతా ఏరియాలతో సమానంగా అభివృద్ధి చేయడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్ నగరం మొత్తాన్ని ఒకే తరహాలో డెవలప్ చేయడానికే ORRని ఇక సరిహద్దుగా పెట్టుకున్నాం అంటోంది రేవంత్ సర్కార్.
ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలన్నింటినీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా చూపుతున్న సర్కార్.. అన్ని ప్రాంతాలను ఒకే గొడుగు కిందికి తెచ్చి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం ఈ కోర్ అర్బన్ రీజియన్‌లో నాలుగు రకాల పాలన ఉంది. ఈ వ్యత్యాసాలను తొలగించాలంటే.. విలీనం ఒక్కటే మార్గమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నా, అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలు విస్తరించాలన్నా, కాలుష్య నియంత్రణ, పెట్టుబడుల సమన్వయం, ప్రజలకు మెరుగైన సేవలకు నగర పరిధిని విస్తరించడమే పరిష్కారంగా చెబుతోంది.
ఇప్పటిదాకా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ.. సర్కార్ నిర్ణయంలో మూడింతలు పెరిగింది. 650 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్.. ఇప్పుడు 2060 కిలోమీటర్లకు విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ జనాభా 67 లక్షల 31వేలు. కానీ ఈ జనాభా రెండింతలు పెరిగి కోటి 40 లక్షలుగా ఉంది. ఇక 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేస్తే కోటీ 70 లక్షలకు చేరుకుంటుంది. జనగణన చేస్తే కచ్చితంగా 2 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా గ్రేటర్ హైదరాబాద్ ఉంటుందని చెబుతోంది ప్రభుత్వం.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ విలీనంతో ఇబ్రహీంపట్నం, మేడ్చల్ నియోజకవర్గాలు కూడా గ్రేటర్‌లో కలుస్తాయి. ఇప్పటిదాకా జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, చేవెళ్ల లోక్‌సభ స్ధానాలున్నాయ్. విలీనంతో భువనగిరి లోక్‌సభ స్థానంలోని ప్రాంతాలు కూడా జీహెచ్ఎంసీలో కలుస్తాయి. ఔటర్ రింగ్ రోడ్ దాకా ఒకే జీహెచ్ఎంసీగా చేయడం ద్వారా.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో 150 డివిజన్లను 300కు పెంచారు.
విలీనంతో జీహెచ్ఎంసీకి ఆదాయం పెరగడం ఖాయం. జీహెచ్ఎంసీకి 2024లో 3వేల 321 కోట్ల ఆదాయం వస్తే.. ఇకపై అది 6వేల కోట్లు దాటబోతోంది. ఒక్క టౌన్ ప్లానింగ్ విభాగం నుంచే ఏడాదికి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేది. విలీనంతో రెండింతల ఆదాయం రాబోతోంది. ప్రాపర్టీ ట్యాక్ ఆదాయం 2వేల కోట్ల నుంచి 3500 కోట్లకు పెరగనుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి 5వేల 500 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆదాయం పెరిగితే అవి తీరటంతో పాటు మళ్లీ అప్పులు పుట్టే అవకాశం కూడా ఉంటుంది.





