పదిహేనేళ్లక్రితం రోబో సినిమా వచ్చినప్పుడు అమ్మో యంత్రానికి ప్రాణమొస్తే.. దానికి భావోద్వేగాలు కూడా జతకలిస్తే ఇంకేమన్నా ఉందా అనుకున్నారు. కానీ ఆ మరయంత్రుడు ఇప్పుడు మన మధ్యకొచ్చేశాడు. మనకన్నా మెరుగ్గా స్పందిస్తున్నాడు. మన కుర్చీలు కూడా లాగేసుకుంటున్నాడు. సాంకేతికత అనివార్యం. దాన్ని ఆపే ప్రయత్నం చేయడమంటే నిప్పును గుప్పెట్లో పట్టుకోవడమే. కానీ సాంకేతికత ముఖ్యమా దాన్ని సృష్టించిన మనిషి ముఖ్యమా అంటే రెండూ ముఖ్యమే. కానీ రెంటిమధ్యా ఇప్పుడు సంఘర్షణ మొదలైంది. తనమేథస్సులోంచి వచ్చిన సాంకేతికతని చూసి ఆ బ్రహ్మ సృష్టించిన మనిషిలోనే భయం మొదలైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. షార్ట్‌కట్‌లో AIగా అందరి నోళ్లలో నానుతున్న ఈ కృత్రిమమేథ ఇప్పుడు కొత్త సవాళ్లు విసురుతోంది. సాంకేతిక నిపుణులకు సహాయకారిగా ఉంటుందనుకున్న ఏఐ టూల్ ఇప్పుడు వారి ఉద్యోగాలకే ఎసరుపెట్టేలా ఉంది. ఆంథ్రోపిక్ సంస్థ ప్రకటన నిపుణుల సామర్ధ్యానికే సవాల్ విసిరేలా ఉంది. ఆ సంస్థ రూపొందించిన కొత్త ఏఐ టూల్ మ్యాన్‌పవర్ అవసరం లేకుండానే స్వతంత్రంగా, సొంతంగా ఆఫీస్ పనులు చక్కబెట్టేస్తోంది. ఈ ప్రయోగంఐ అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ చేసిన ప్రకటన టెక్నాలజీ రంగాన్ని షేక్‌చేస్తోంది.
- ఆంథ్రోపిక్ ప్లగిన్‌లు గతంలో వ్యక్తులు లేదా ప్రత్యేక సాఫ్ట్‌వేర్లు చేసే పనులను క్షణాల్లో చేస్తున్నాయి.
- లీగల్ ప్లగిన్ సామర్థ్యం బయటపడగానే లీగల్ టెక్నాలజీ కంపెనీలైన థామ్సన్ రాయిటర్స్, లీగల్ జూమ్ వంటి షేర్లు 15-20% పడిపోయాయి.
- ఫైనాన్స్ ప్లగిన్ అకౌంటింగ్ వివరాల నమోదు, ఖాతాల పరిశీలన, ఆర్థిక నివేదికలను సిద్ధం చేయడం వంటి పనులు చేస్తుంది.
- డేటాబేస్‌ల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయడం, ఆ డేటా ఆధారంగా అందమైన డాష్‌బోర్డులుగా మార్చడం డేటా అనాలసిసస్ ప్లగిన్ పని.
- ల్యాబ్ డేటాకు అనుసంధానమై, శాస్త్రీయ పరిశోధనల ప్రారంభ దశలో కీలక సాయాన్ని బయో రీసెర్చ్ ప్లగిన్ అందిస్తుంది.
అమెరికాకు చెందిన AI స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ జనవరి చివరివారంలో క్లాడ్ కోవర్క్‌ను ఆవిష్కరించింది. వివిధ రంగాల్లో పనులు చక్కబెట్టేందుకు 11 కొత్త ప్లగిన్‌లను విడుదల చేసింది. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినైలాంటి ఏఐ టూల్స్ అన్నీ మనం ఏం అడిగితే వాటికే సమాధానం ఇస్తాయి. కంటెంట్ అడిగితే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాస్తాయి. కానీ క్లాడ్ కోవర్క్ వీటికి పూర్తి భిన్నం. అనుభవజ్ఞుడైన ఉద్యోగిలా ఏ ప్రశ్నకైనా సమాధానాలు ఇవ్వడమే కాదు, నేరుగా డ్యూటీలోకి దిగి వర్కంతా పూర్తి చేస్తుంది. అంటే క్లాడ్ కోవర్క్ ఏఐ టూల్ కాదు.. ఓరకంగా ఫుల్‌టైమ్ డిజిటల్ ఎంప్లాయ్.
ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ మన ఐటి నిపుణుల్లో వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే మన ఐటీ కంపెనీల ఆదాయమార్గాల్లో అమెరికా, యూరప్ దేశాల సంస్థలదే మెజార్టీ వాటా. అక్కడి వాణిజ్య సంస్థల కోసం మన ఐటీ కంపెనీలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. దీనికోసం భారీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను నియమించుకుంటున్నాయి. ఆంథ్రోపిక్ టూల్స్ ఎఫెక్ట్‌తో ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గే ప్రమాదం ఉంది. బిల్లబుల్ హవర్స్‌లో ఇన్నాళ్లూ పేమెంట్ చేస్తున్న విదేశీ సంస్థలకు.. క్లాడ్ వంటి ఏఐ టూల్స్ స్పీడ్‌గా పనిచేసి పెడుతున్నాయి. దీంతో ఈ టెక్నాలజీ ఐటీ అవకాశాలపైనా తీవ్ర ప్రభావంచూపేలా ఉంది.

