బ్రెజ్జాతో రోడ్డెక్కినవాడికీ, బెంజ్‌కారులో బయలుదేరినవాడికీ తేడా ఉంటుంది. ఇండస్ట్రీ కూడా అలాగే ఉంది. సౌత్ సిన్మా ఆడితే మీరేంటీ మీ రేంజ్ ఏంటీ అంటోంది బాలీవుడ్. ఇండస్ట్రీ అంటే మేమేనని కాలర్ ఎగరేస్తోంది. మీకంత సీన్ ఉందా అన్నట్లు అవహేళన చేస్తోంది బాలీవుడ్. ఇలా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, తొలి తరం నుంచి నేటి తరం వరకు సౌత్ ఇండస్ట్రీ. నార్త్ ఇండస్ట్రీ మధ్య ఓగీత కనిపిస్తూనే ఉంది.
అప్పుడెప్పుడో చిరంజీవి ఓమాట చెప్పాడు..సౌత్ అంటే నార్త్‌వాళ్లకి చులకన భావం ఉందని. మనపట్ల బాలీవుడ్ చూపుతున్న వివక్షకు మెగాస్టార్ గుండెల్లోంచి వచ్చిన ఆవేదన అది. ఇండియన్ యాక్టర్ అంటే కేవలం బాలీవుడ్ యాక్టరేనన్న భావం నరనరాన ఇంకిన అహం వారిమాటల్లోనూ, హవభావాల్లో కనిపిస్తోంది. ఇఫ్ఫీ స్టేజ్‌పై రణవీర్ ఓ స్టెప్ వేశాడు. కానీ స్టెప్ కంటే ఆయనగారి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ దేశం మొత్తాన్ని షేక్ చేసింది. కాంతారా దేవదేవుడి సన్నివేశం… పరమ శక్తి ఆవహించిన సీన్‌ను మిమిక్రీ చేసేశాడు రణ్‌వీర్.
రణ్‌వీర్ కాంతారా బాగుందన్నాడు. రిషబ్‌శెట్టి నటన అద్భుతమన్నాడు. కాంతార-3లో తనకు ఛాన్స్ ఇస్తారా అని కూడా అడిగాడు.. కానీ ఈ డైలాగ్‌లన్నీ ఒకేఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో కొట్టుకుపోయాయి. కన్నడ సంప్రదాయాల్ని అవమానించారనే కోపమే ఇప్పుడు అందరిలో కనిపిస్తోంది. 2025లో రిలీజైన అన్ని సినిమాల్లోకంటే కూడా కాంతారానే టాప్. అన్ని భాషల్లోనూ ఆ సిన్మాకి మంచి ఆదరణ వచ్చింది. దేవతకీ, దెయ్యానికీ తేడా తెలియనట్టు రణ్‌వీర్ స్టేజ్‌పై చూపించిన హావభావాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా ఇటీవలే దక్షిణాది సినిమాలపై చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. సౌతిండియన్ సినిమాల్లో విలన్లుగా బాలీవుడ్ హీరోలను తీసుకోవడం ఆయనగారికి నచ్చడం లేదట. ఆ మాటలు ఇంకా మర్చికోముందే.. కన్నడ సూపర్ హిట్ సినిమాని అవహేళన చేసేలా రణ్‌వీర్ చేష్టలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదంతా రావడానికి కారణం.. బాలీవుడ్ తానే ఇండస్ట్రీ బాస్ అన్న భావనతోనే ఉండిపోవడమే. కానీ బాలీవుడ్‌కు మించిన రికార్డులను సౌత్ ఇండస్ట్రీ నమోదు చేస్తోంది.
బాహుబలి నుంచి కేజీఎఫ్ వరకు, పుష్ప నుంచి కాంతారా వరకు…ప్రతి హిట్ ఇచ్చిన సందేశం ఒక్కటే. కంటెంట్ ఉన్నోడికి కటౌట్‌తో పనిలేదని, భాష ఒక అడ్డుగోడ కాదని. బాహుబలి ఏ రేంజ్‌లో హిట్ అయిందో ఇండియాకే కాదు, యావత్ ప్రపంచానికీ తెలుసు. కానీ బాలీవుడ్ తట్టుకోలేకపోయింది. అసలు ప్రభాస్ హీరో మెటీరియలే కాదని కారుకూతలు కూసింది. ఇక ట్రిపులార్ టైమ్‌లో రామ్‌చరణ్, తారక్‌పై బాలీవుడ్ మీడియా ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆర్షద్ వార్సీ లాంటి నటులైతే హీరో ప్రభాస్‌ను జోకర్‌తో సంబోధించాడు. ఆదిపురుష్ టైమ్‌లో వివేక్ అగ్నిహోత్రి అయితే ప్రభాస్ నటుడే కాదన్నాడు.
రణవీర్ ఓవరాక్షన్ వ్యక్తిగతమా? లేదా బాలీవుడ్ అజ్ఞానానికి ప్రతిబింబమా? అన్నది పక్కన పెడితే, భారతీయ సంస్కృతిని ప్రాంతాలకు అతీతంగా గౌరవించడంలోనే కళాకారుడ్ని ఒక మెట్టుపై నిలబెడుతుంది.. కానీ ఇక్కడే బాలీవుడ్ పదేపదే తప్పులు చేస్తూ వస్తోంది. సౌత్ ఇండస్ట్రీ తలగెరేసే హిట్ కొట్టిన ప్రతీసారి బాలీవుడ్ కడుపు మంట ఏదో రూపంలో బయటపడుతూనే ఉంది.





