ఢిల్లీ పేలుడు కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. అల్‌ఫలా యూనివర్సిటీ నుంచి అదృశ్యమైన 10 మంది సిబ్బంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి మాయమైన కెమికల్స్ కోసం సెర్చింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడుకు కుట్ర జరిగిన అల్ ఫలా యూనివర్సిటీలో దర్యాప్తు సంస్థల సోదాలు కొనసాగుతున్నాయి. టెర్రర్ డెన్‌కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ డాక్టర్ ఉమర్‌కు యూనివర్సిటీలో చాలామంది సహకరించినట్టు ఆరోపణలొస్తున్నాయి. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కెమికల్స్ మాయం కావడం వెనుక వీళ్ల హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు.
ఉమర్‌తో టచ్‌లో ఉన్న 10 మంది అల్‌ఫలా యూనివర్సిటీ సిబ్బంది ఆచూకీ చిక్కడం లేదు. పేలుడు జరిగిన నవంబరు 10 నుంచి వాళ్ల ఫోన్లు స్విచాఫ్‌లో ఉన్నాయి. చాలామంది అల్‌ఫలా సిబ్బంది తమ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేశారు. అల్-ఫలా యూనివర్సిటీ ఉగ్ర సంబంధాలపై ఫరీదాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అల్-ఫలా కాలేజ్‌కి అతి సమీపంలో ఉన్న ధౌజ్ గ్రామంలో సోదాలు కొనసాగుతున్నాయి. దుకాణాలతో పాటు అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.
నవంబరు 10 నుంచి అనేక మంది అధ్యాపక సిబ్బంది అజ్ఞాతంలో ఉన్నట్టు తేల్చారు. పలువురి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన పోలీసులు.. నిధులు, కాల్ లాగ్స్, చాటింగ్ హిస్టరీపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు యూనివర్సిటీ సిబ్బంది. ఇప్పటికే సోషల్ మీడియా ఖాతాలు డిలీట్ చేశారు సిబ్బంది. అనుమానితుల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ప్రొఫైల్‌లు డిలీట్ చేసి మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేశారు. ఉగ్రదాడి కుట్రలో అనేక మంది వ్యక్తుల పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు తరువాత అల్ ఫలా యూనివర్సిటీ విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.





