వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు ఆయన చెల్లి, తల్లి అంతా తామైపార్టీని నడిపించారు. పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లారు. జగన్ అరెస్ట్‌పై సెంటిమెంట్‌ని రగిలించారు. ఒకవేళ ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు నారా లోకేష్‌ని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తే టీడీపీని ఎవరు నడిపిస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే భువనేశ్వరి, బ్రాహ్మణి పార్టీ పగ్గాలు చేపడతారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. పైగా తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎక్కడికీ పోదని, చంద్రబాబు భార్యగా, ఎన్టీఆర్ బిడ్డగా తాను హామీ ఇస్తున్నానని ములాఖత్ తొలి రోజే చెప్పారు భువనేశ్వరి. అంత దూరమొస్తే పార్టీ కూడా భువనేశ్వరి, బ్రాహ్మణికి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగానే ఉంది.
ఎంత మంది టీడీపీ నేతలను అరెస్ట్ చేసినా పార్టీలో నాయకత్వ సమస్య రాదంటున్నారు టీడీపీ సీనియర్లు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడులాంటివారి వ్యాఖ్యలు ఆ ఆలోచనలో భాగమే. నారా బ్రాహ్మణిని ముందుపెట్టి పార్టీని నడిపిస్తామని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు అయ్యన్నపాత్రుడు.
చంద్రబాబు రిమాండ్‌ని పొడిగిస్తుండటంతో పార్టీ వ్యవహారాలను భువనేశ్వరి, బ్రాహ్మణి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఓవైపు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూనే, నేతలతో సమావేశం అవుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ, జనసేన నేతలతో బ్రాహ్మణి సమావేశం కావడం ఆసక్తికర పరిణామం. 14 మంది ముఖ్య నేతలతో టీడీపీ ఏర్పాటుచేసిన యాక్షన్ కమిటీలో భువనేశ్వరి, బ్రాహ్మణి లేకపోయినా జనసేన నేతలతో వీళ్లిద్దరూ చర్చిస్తున్నారు.
నారా లోకేష్‌ని సీఐడీ అరెస్ట్ చేస్తే యువగళం ఆగిపోతుంది. పాదయాత్రలోనే లోకేష్‌ని అరెస్ట్ చేస్తే భువనేశ్వరి, బ్రాహ్మణి పాదయాత్ర కొనసాగిస్తారంటున్నాయ్ టీడీపీ శ్రేణులు. పార్టీ ఇంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా తిరిగి యువగళం ప్రారంభిస్తానని లోకేశ్ ప్రకటించడం వెనుక వ్యూహం కూడా ఇదేనంటున్నారు. లోకేష్ ఆపేసిన దగ్గరినుంచీ పాదయాత్ర కొనసాగించడం, లేదంటే రాష్ట్రవ్యాప్త పర్యటనకు కొత్తగా ప్లాన్ చేయడం చేస్తారంటున్నారు. సీఐడీ అధికారులు ఇప్పటికే నారా లోకేష్ పేరు ప్రస్తావించారు. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లలో ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. లోకేష్ అరెస్ట్‌పై వైసీపీ నేతలు పదేపదే సంకేతాలిస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత కుటుంబం ఈ పరిణామాలకు మానసికంగా సిద్ధపడుతోంది.
చంద్రబాబు అరెస్ట్‌ని నిరసిస్తూ పోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్లింది లోకేషే. రాష్ట్రపతిని కూడా కలిసి టీడీపీ బృందం ఫిర్యాదుచేసింది. ఇప్పుడు ఢిల్లీ వదిలి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు నారా లోకేష్. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే అది ప్రజల మధ్యే జరగాలన్న వ్యూహంతోనే లోకేష్ మళ్లీ యువగళం ప్రారంభిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ అధినేత జైల్లో ఉండగా పాదయాత్ర చేస్తూ పోతే దాని ప్రభావం ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. కీలక సమయంలో కేడర్‌కి అందుబాటులో ఉంటూ అన్ని నియోజకవర్గాల బాధ్యతలను చూడాల్సిన వేళ పాదయాత్ర చేస్తే పార్టీకి ఉపయోగమేనా అన్నది కూడా ఓ యాంగిల్ .
వన్‌బైవన్ అరెస్ట్ చేస్తూ పోతే టీడీపీకి సింపథీ వస్తుందన్న వాదన వైసీపీలో ఉంది. అయితే న్యాయస్థానాల ముందు ఆధారాలు పెడుతున్నాం కాబట్టి ప్రజల్లో ఆచర్చ కూడా ఉందనీ, ముఖ్యనేతలను లోపలేస్తే ఎన్నికలముందు విపక్షపార్టీ అష్టదిగ్బంధనంలో పడుతుందనేది వైసీపీ పెద్ద వ్యూహం. బెయిలా, జెయిలా అన్న టాపిక్ తప్ప టీడీపీనుంచి మరో పాయింట్ ఉండదు. ఈ సమయంలో పథకాలు, ప్రచారాలతో ప్రజలను పార్టీ వైపు టర్న్ చేసుకోవచ్చన్నది వైసీపీ ఆలోచన.