కేర‌ళ కాదు.. ఇక‌పై కేర‌ళం!

kerala-culture.jpg

దేవ‌భూమిగా ప్రాచుర్యంలో ఉన్న కేరళ పేరు మార‌బోతోంది. రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పేరు మార్పుపై కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఇప్పటికే కేరళ అసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసింది. 2026లోనే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పేరు మార్పు సెంటిమెంట్ ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కేర‌ళ రాష్ట్రం పేరును మ‌ల‌యాళంలో పూర్వం నుంచే కేర‌ళం అని పిలిచేవారు. కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారు. వారు చేసిన మార్పులను రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నామ‌ని పిన‌ర‌యి విజ‌య‌న్ స‌ర్కారు ప్ర‌క‌టించింది. కేరళ పేరు మార్పుపై తొలిసారి 2023లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంలో కేర‌ళ లెఫ్ట్ ప్ర‌భుత్వానికి కేంద్రంలోని ఎన్టీయే ప్ర‌భుత్వం మ‌ద్ద‌తిచ్చింది.

కేర‌ళ రాష్ట్రం పేరు మార్పుపై బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తీసుకుంటారు. తర్వాత రాష్ట్రపతి సిఫార్సుతో పేరు మార్పు బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఆ బిల్లు ఆమోదానికి సాధారణ మెజార్టీ సరిపోతుంది. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో అధికారికంగా పేరు మారుతుంది. ఈ ప్రక్రియకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు.

కేరళ పేరు మార్పు ప్ర‌తిపాద‌న‌పై సానుకూలంగా స్పందించిన కేంద్రం, పశ్చిమ బెంగాల్ విషయంలో కొన్ని దశాబ్దాలుగా విముఖత వ్యక్తం చేస్తూ వ‌స్తోంది. పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగో’ లేదా ‘బంగ్లా’గా మార్చాలని అప్ప‌టి జ్యోతి బసు నుంచి ఇప్పుడున్న‌ మమతా బెనర్జీదాకా కనీసం నాలుగు సార్లు అసెంబ్లీ తీర్మానాలు చేసినా కేంద్రం వాటిని తిరస్కరించింది.

2016లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు పేర్ల విధానాన్ని కేంద్రం తిరస్కరించింది. 2018లో ‘బంగ్లా’ అనే పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించినా, పొరుగుదేశం బంగ్లాదేశ్‌ని పోలి ఉందని కేంద్రం అభ్యంత‌రం వ్య‌క్తంచేసింది. కేరళ ప్రతిపాదన ఆమోదం పొందగానే బెంగాల్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. పేరు మార్పుకోసం త‌మ పోరాటం కొన‌సాగుతూనే ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

Share this post

submit to reddit
scroll to top