సైబర్ నేరాలు, మోసాలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ప్రధానమైనవి. ఎక్కడో, ఏ దేశంలోనో ఉండి.. మారుమూలన ఉన్న వారి దగ్గరి నుంచి క్షణాల్లో కోట్ల రూపాయలను కొట్టేసి.. దర్జాగా దొరకకుండా తిరుగుతున్న సైబర్ కేటుగాళ్ల పనిపట్టేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. సైబర్ దాడులు జరగకుండా చూడటమే కాకుండా.. సైబర్ మోసాలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు అనేక ఆపరేషన్లు చేస్తున్నాయి.
మన చట్టాలు కాగితపు పులులు. శిక్షల భయంలేదు. కొన్నాళ్లు జైల్లో ఉన్నా మళ్లీ బెయిలొస్తుందనే నమ్మకం.
కానీ చైనాలో అలాకాదు. తేడావస్తే ఈ భూమ్మీద నూకలు చెల్లిపోతాయి. రూ.11,500 కోట్ల భారీ సైబర్ నేరాలకు పాల్పడ్డ ముఠాను పట్టుకుని.. వారిలో ఓ కుటుంబం సహా 11 మందికి మరణశిక్షలు అమలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది డ్రాగన్ కంట్రీ.
ఉత్తర మయన్మార్‌లో ఇంటర్నెట్ స్కామ్‌లు, వ్యభిచారం, మాదకద్రవ్యాల రవాణాలో కొన్ని కుటుంబాలు ఆరితేరాయి. ఇందులో మింగ్ ఫ్యామిలీ సహా నాలుగు కుటుంబాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా వీరి ఆగడాలపై అనేక ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన చైనా అధికారులు కొన్ని కుటుంబాలను అదుపులోకి తీసుకున్నారు. 2025 సెప్టెంబరులో జెజియాంగ్ కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దాన్ని తాజాగా అమలు చేశారు.
హత్య, నేరం, అక్రమ నిర్బంధం, గ్యాంబ్లింగ్ వంటి 14 రకాల నేరాలలో దోషులుగా తేలడంతో 11మందికి చైనాలో మరణశిక్ష అమలుచేశారు. విదేశాల్లో కూర్చుని భారతీయుల సొమ్మును దోచుకుంటున్న సైబర్ ముఠాలపై భారత్ కూడా ఇప్పటికే డిజిటల్ స్ట్రయిక్ మొదలుపెట్టింది. లక్షలాది నకిలీ సిమ్ కార్డులను బ్లాక్ చేయడం, బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడం, అంతర్జాతీయ ఆపరేషన్లతో నేరగాళ్ల వేట కొనసాగిస్తోంది.
అయితే, చైనా మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, మరణశిక్షలు అమలు చేసి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. మన దేశంలోనూ సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ఈ సైబర్ రాక్షసులపై చట్టాలు మరింత కఠినం కావాలన్న డిమాండ్ పెరుగుతోంది.





